వైరల్ 'చీటింగ్ బ్రైడ్' వీడియో వెనుక అసలు ట్విస్ట్.. ఆ కన్నీళ్ల వెనుక ఉన్న నిజం ఇదీ!

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎర్రటి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక వధువు, తన పెళ్లికి కేవలం కొన్ని గంటల ముందు తన మాజీ ప్రియుడిని కలిసి కన్నీరు పెట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. 'చీటింగ్ బ్రైడ్' అనే పేరుతో నెట్టింట హల్ చల్ చేసిన ఈ వీడియో చూసి లక్షలాది మంది నెటిజన్లు ఆ యువతిని దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె క్యారెక్టర్‌ను విమర్శిస్తూ వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలో పెళ్లికూతురిగా కనిపించిన యువతి పేరు శ్రుతి దాహుజా. ఆమె ఒక నటి. తాజాగా ఆమె స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది నిజం కాదని, అది కేవలం ఒక 'స్క్రిప్టెడ్ డ్రామా' అని స్పష్టం చేసింది. ఆరవ్ మావి అనే కంటెంట్ క్రియేటర్ కోసం తాను నటిగా ఆ సీన్లో నటించానని వెల్లడించింది. అయితే, ఆ వీడియోను అప్లోడ్ చేసేటప్పుడు అది ఒక నటన అని ఎక్కడా పేర్కొనలేదని, తన అనుమతి లేకుండానే సోషల్ మీడియాలో పెట్టారని ఆమె ఆరోపించింది. దీనివల్ల తన వ్యక్తిగత జీవితం మరియు ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు, ఈ వివాదంపై వీడియో క్రియేటర్ తరపు వారు మరోలా స్పందిస్తున్నారు. వీడియో వైరల్ అయ్యి వ్యూస్ వస్తున్నప్పుడు శ్రుతి చాలా సంతోషించిందని, కానీ నెగటివ్ కామెంట్స్ రావడం మొదలవ్వగానే సీన్ మార్చేసిందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆమె తమను భారీగా డబ్బులు డిమాండ్ చేసిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూస్ కోసం ఒక వ్యక్తిని సమాజం ముందు తప్పుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? డిజిటల్ కంటెంట్ క్రియేషన్ పేరుతో జరిగే ఇలాంటి మోసాలపై నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు.
వైరల్ 'చీటింగ్ బ్రైడ్' వీడియో వెనుక అసలు ట్విస్ట్.. ఆ కన్నీళ్ల వెనుక ఉన్న నిజం ఇదీ!
Share this article: